రేకుల షెడ్లు నిర్మించి ఇంధ్రభవనాలను కట్టినట్లు ధర్నాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటివరకు కనీసం ఎలాంటి రాజకీయ సభలలోను పాల్గొనని భువనేశ్వరిని సైతం తీసుకువచ్చి ధర్నా చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసినట్లుగా పేర్కొనడం చూస్తుంటే రెండు గాజుల కథను తలపిస్తుందన్నారు. తాను తిరుపతి అలిపిరివద్ద రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి వచ్చే రైతులను పలకరిస్తే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూమి పులకించిందని, మళ్లీ నేడు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు అండ్‌కోకు మాత్రం ఉక్రోషం, కడుపుమంట పెరిగిపోతున్నాయన్నారు. వేలాది ఎకరాలను ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేసి పేద రైతులను నిలువునా దగా చేసి నేడు రైతుల కోసం అంటూ ఉద్యమించడం దారుణం అన్నారు.
ఒంగోలు: రాష్ట్రానికి 30 ఏళ్లపాటు జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌వీబీసీ చైర్మన్ బి.పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిస్థితులను కళ్లారా చూస్తే అక్కడ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో అర్థం అవుతుందన్నారు. సీఎం కాన్వాయ్ వెళుతుంటే దారి పొడవునా ఉండే పోలీసులకు కనీసం అత్యవసరం అయితే టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు లేవన్నారు. బాహుబలి కట్టడాలంటూ సింగపూర్‌ను తలపిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు కనీసం కార్లు పెట్టుకునేందుకు స్టాండ్లు సైతం లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.